మహేశ్‌తో ముచ్చటగా మూడోసారి
మహేశ్‌తో ముచ్చటగా మూడోసారి…
`మహర్షి`తో కథానాయకుడిగా పాతిక చిత్రాల మైలురాయికి చేరుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు… ప్రస్తుతం `సరిలేరు నీకెవ్వరు`లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్లో మహేశ్‌కి జోడీగా రష్మిక నటిస్తుండగా… అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనుంది.
కాగా, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడ మహేశ్, రాజేంద్రప్రసాద్ తదితరులపై ఆర్మీ నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా ఏస్ సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు.
మహేశ్ సినిమాకి రత్నవేలు కెమెరామేన్‌గా పనిచేయడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు ఈ ఇద్దరి కలయికలో `1 నేనొక్కడినే`, `బ్రహ్మోత్సవం` చిత్రాలు వచ్చాయి. మరి… ముచ్చటగా మూడోసారి జట్టుకట్టిన ఈ సినిమాతోనైనా మహేశ్, రత్నవేలు కాంబినేషన్ బ్లాక్‌బస్టర్ అందుకుంటుందేమో చూద్దాం. 2020 సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` ప్రేక్షకుల ముందుకు రానుంది