శోభన్‌బాబు, మాయలేడి
శోభన్‌బాబు, మాయలేడి
తెలుగు సినిమా పరిశ్రమలో అందాల నటుడు అంటే శోభన్‌బాబు మాత్రమే. ఆయన ఆహార్యం, ముఖంపై చిరునవ్వు ఎదుటివాడిని ఇట్టే కట్టిపడేస్తాయి. ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన శోభన్‌బాబు ఈ సినీ లోకాన్ని, తన అభిమానులను మెప్పించారు. ఆయన సినిమాలు మానేసే దశలో ‘సర్పయాగం’తో పాటు ‘దోషి-నిర్దోషి’ అనే మరో చిత్రం చేశారు. రెండు మంచి హిట్లయ్యాయి. అప్పుడు శోభన్‌బాబు నేను గౌరవంగా రిటైర్ అయ్యేలా రెండు మంచి హిట్లు వచ్చాయని ఆనందపడ్డారు. శోభన్‌బాబు ఇప్పటికీ అందరి మనసుల్లో చిరస్థాయిగా బ్రతికే ఉన్నారు.
ఇకపోతే సంపూర్ణ రామాయణం చిత్రం మాయలేడి కోసం, వెతికి వెతికి మద్రాసులో ఒకరు పెంచుకుంటున్న లేడిని తీసుకొచ్చారు. దాని ఒంటికి బంగారు రంగు పూశారు. ఒక షాట్లో అది పరుగెత్తితే రాముడు శోభన్‌బాబు దాని వెంట పడతాడు. కాని లేడి పరుగెత్తడం లేదు. అది మద్రాసు మహానగరంలో పెరిగింది. షూటింగ్ ప్రాంతం అడవి అంతా దానికి కొత్తగా ఉంది. షాట్లో ఉన్న శోభన్‌బాబు పరిగెత్తుకుంటూ వచ్చి, తన చేతిలో ఉన్న బాణంతో లేడిని ఒక తన్ను తంతాడు. అది బెదిరి దెబ్బకి పరుగు తీసింది. అది అడవిలోకి వెళ్ళకుండా తారు రోడ్డు ఎక్కింది, మద్రాసులో పెరిగింది గదా!
లేడి లేకపోతే షూటింగ్ ఆగిపోతుంది. దాన్ని పట్టుకోవడానికి కొంత మంది ప్రొడక్షన్ బాయ్స్, కొందరు అసిస్టెంట్ డైరెక్టర్లు వెంటబడ్డారు. అది వేగం పెంచింది. మరికొంత మంది జీప్ ఎక్కి దాన్ని ఫాలో అయ్యారు. అది పరుగెత్తి పరుగెత్తి, ఒక కిలోమీటరు వరకు వెళ్ళి అలసిపోయి, ఎదురుగా లారీ వస్తుంటే ఆగిపోయింది. దాన్ని తీసుకువచ్చి రాలిపోయిన బంగారు రంగు మళ్ళీ పూసి మానవహారం మధ్య షూటింగ్ జరిపించారు. అలా మాయలేడి బృందానికి భలే పని కల్పించింది.