ఆమె నా స్ఫూర్తి

ఆమె నా స్ఫూర్తి
కొందరు వ్యక్తులు చాలా సహజంగా, వాస్తవంగా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భావోద్వేగాలకు లోను కాకుండా ఉంటారు. ఎదుట వ్యక్తులు వాళ్లను అకారణంగా దారుణంగా దూషించినా సరే వారి పట్ల వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేయరు. వ్యతిరేకతని కూడా సానుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తారు. బాలీవుడ్ తాప్సి అటువంటి తారేనేమో అనిపిస్తుంది. ‘మిషన్ మంగళ్’ విజయోత్సాహంలో ఉన్న ఈమెకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్ఫూర్తి. కంగనా అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏదైనా అంశంపై మాట్లాడితే దానిని ప్రతి ఒక్కరూ సమర్థించాలనే తత్వం ఆమెది. ఒక వేళ దాని గురించి స్పందించకపోయినా తిడుతుంది. ఇదే తీరు ఇటీవల ఎక్కువగా కనిపిస్తుంది. అదే కోణంలో తాప్సీ పన్నును కూడా విమర్శించింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే కంగనా రనౌత్‌కు ట్విట్టర్ ఖాతా లేదు. ఆమె సోదరి రంగోలి చందేల్‌కు ఉంది. కంగనా, రంగోలి అభిప్రాయాలు ఇద్దరివీ చందేల్ ట్విట్టర్ ఖాతా నుంచే వస్తాయి. విమర్శలన్నీ ఈమె ఖాతా నుంచే వెలువడుతాయి. తాప్సీ సస్తీ కాపీ అంటూ వచ్చిన విమర్శ కూడా కంగనా తరఫున రంగోలీ ట్విట్టర్ నుంచే వచ్చింది. అయినా తాప్సీ పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే తాప్సీకి కంగనా స్ఫూర్తిగా నిలిచారు. అదీ ఒక్క విషయంలోనే. కంగనా మనస్సులో ఏం అనుకుంటుందో అదే విషయాన్ని ఎటువంటి భయం లేకుండా బయటకు చెప్పడం అనే విషయంలో తాప్సికి స్ఫూర్తి. ఇక్కడ ఈ కథానాయికకు స్ఫూర్తిగా నిలిచిన వారు జాబితాను కూడా ఈ సందర్భంగా వెల్లడించింది. అందులో ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ ఉన్నారు. ప్రియాంక చోప్రా ఓ ప్రతిభావంతురాలని ప్రశంసిస్తుంది. నిజాయితీగా మాట్లాడే అనుష్క శర్మ అంటే కూడా తాప్సికి ఇష్టమేనట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తనపై కంగనా చేసిన ‘సస్తీ కాపీ’ కామెంట్‌పై తాప్సి స్పందిస్తూ ‘ఈ విషయంలో కంగనా నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆమెకు నాపై ఉన్న అభిప్రాయం. అదే విషయాన్ని నిజాయితీ చెప్పింది. నేను మంచి నటులను కాపీ చేస్తున్నానని ఆమె చెబుతుందంటే అది కాంప్లిమెంట్‌గానే తీసుకుంటాను. కంగనా రనౌత్‌లా నేను ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకోవడం లేదు. ఆ పేరు ఆమెకైతే సరిపోతుంది” అని పేర్కొంది ఆమె. అయినా కంగనా తనకు స్ఫూర్తేనని పేర్కొంది. సమాజంలో ప్రతివంతులైన స్త్రీ, పురుషులందరికీ సమాన అవకాశాలు వచ్చినప్పుడు తానొక ఫెమినిస్టుని అని చెప్పుకునే రోజు వస్తుందని, అదే తన కోరిక అని, దాని కోసం ఉద్యమించాలని పిలుపునిస్తుంది తాప్సి.