నా తుది శ్వాస వరకూ పోరాడతా..
నా తుది శ్వాస వరకూ పోరాడతా..
ఎక్కడ దాడులు చేస్తే ఆ గ్రామంలోనే బస చేస్తా, బాధితులకు అండగా ఉంటా..
వేమూరు నియోజకవర్గ కార్యకర్తలు, రైతులతో సమావేశంలో చంద్రబాబు
గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బుధవారం వేమూరు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, మహిళలు, రైతులు భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, ‘‘ఎక్కడ వైసిపి నేతలు దాడులు చేస్తే ఆ గ్రామంలోనే బస చేస్తా..కార్యకర్తల్లో భరోసా నింపుతా..బాధితులకు అండగా ఉంటా..ప్రజల కోసమే ఎన్ని నిందలైనా భరిస్తా..తుది శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా, పేదల సంక్షేమానికే పాటుబడతా..
ఓటేయలేదని తాగునీటి సరఫరా నిలిపేస్తారా..? ఓటేయలేదని రోడ్డుకు అడ్డంగా గోడలు కడతారా..? పంట భూములను సాగు చేసుకోనివ్వరా..? ఊరొదిలి వెళ్లిపొమ్మంటారా..? ఇదేమైనా మీ ఇష్టారాజ్యమా..?
రేపు టిడిపి గెలిస్తే వైసిపి వాళ్లు ఊళ్లు వదిలిపెట్టి పోవాలా..? 22ఏళ్ల టిడిపి పాలనలో ఈ దౌర్జన్యాలు, దాడులు ఉన్నాయా..?
శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యత పోలీసులది కాదా..? బాధితులపైనే నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయడం అన్యాయం కాదా..? అధికారంలో ఏ పార్టీ ఉన్నా సమర్ధ పోలీసింగ్ జరగాలి.
అసెంబ్లీలో ఛోటామోటా నేతలతో నన్ను బెదిరిస్తారా..? మీరు బెదిరిస్తే నేను బెదిరిపోతానా..?
చివరికి నా భద్రతపై కూడా ఆటలు ఆడటమే కాదు, అన్నివర్గాల ప్రజల భద్రతతో చెలగాటం ఆడతారా..?
నా కష్టాన్ని ప్రజలు గుర్తించలేదనే బాధ ఉంది… అయినా ప్రజలు బాధపడుతుంటే చూడలేక పోతున్నా..
నాయకులంతా గెలుపోటముల చింత వదిలేయాలి, ప్రజల కోసమే పాటుబడాలి. కార్యకర్తలు అధైర్యపడవద్దు. మనకు న్యాయం జరగకపోతే కోర్టులకెళ్లి న్యాయ పోరాటం చేద్దాం.
అన్నివర్గాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోరా…?
ఇసుక ధర 10రెట్లు పెరగడానికి బాధ్యత వైసిపి నేతలది కాదా..? ఎంపిలు,ఎమ్మెల్యేలు లారీలు పంచుకుని ఇసుక దోచేస్తారా..? టిడిపి ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుక ఈ రోజు ట్రాక్టర్ రూ.10వేలకు అమ్ముతారా..? వైసిపి నేతల నిర్వాకాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 32వృత్తులకు చెందిన 20లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ప్రతి నెలా మొదటి తేదీన పించన్ రాకుండా టిడిపి ప్రభుత్వంలో ఉందా..? ప్రతినెలా రూ.3వేల పించన్ లో మోసం, 45ఏళ్లకే పించన్ ఇస్తానని మోసం…పెన్షన్ల కోసం ప్రతి నెలా 2వ వారం దాకా వృద్దుల పడిగాపులు గతంలో చూశామా..?
రేషన్ కార్డులు, బీమా, పెళ్లి కానుక,అన్నా కేంటిన్లు రద్దు చేశారు. కానుకల సంగతి సరే పెళ్లిళ్లు ఆగిపోయే పరిస్థితి కల్పించారు. ఎం బుక్ లో రాశాక, చేసిన పనులు రికార్డు అయ్యాక కూడా నీరు-చెట్టు బిల్లులు చేయరా..?
ఆగస్టు రెండవ వారం వచ్చినా పట్టిసీమ నీళ్లు అందకపోవడం, నాట్లు పడకపోవడం గత 3ఏళ్లలో కృష్ణా డెల్టాలో ఉందా..?
ప్రభుత్వం ఇచ్చిన ప్రాంసరీ నోటీసులు చెల్లదా..? వ్యక్తిగతంగా చంద్రబాబు ఇచ్చిన కాగితాలు కావవి, ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రాంసరీ నోట్లు చెల్లవని రైతులను వేధిస్తారా..? పన్ను బకాయిలు, కరెంటు బకాయిలు గత ప్రభుత్వంలోవి కూడా ప్రజలు చెల్లించాలా..? మరి ప్రభుత్వం చెల్లించాల్సిన రుణమాఫీ 4వ,5వ కిస్తీల చెల్లింపులు రైతులకు చేయరా..?
నాకన్నా మంచోడు కెసిఆర్ అట..అందుకే గోదావరి నీళ్లు తెలంగాణ గుండా శ్రీశైలంలో కలుపుతాడంట..మీ ఇద్దరు బాగుంటే నాకే బాధ లేదు. నా బాధ అంతా ఏపి ప్రజల గురించే. తెలంగాణను అభివృద్ది చేసింది నేనే.
ఉద్యోగాల కోసం ఇక్కడి యువత చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ లకు, విదేశాలకు వెళ్లాలా..? నాపై కక్షతో అమరావతిని చంపేస్తారా..? తక్కువ వడ్డీతో వచ్చే వరల్డ్ బ్యాంకు రుణం పోగొడ్తారా..? నా కోసం హైదరాబాద్ ను అభివృద్ది చేయలేదు. యువత ఉపాధి కోసం సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు అభివృద్ది చేశాం.
అలాంటి కలలే అమరావతి అభివృద్దిపై కన్నాను. ప్రణాళికలు, డిజైన్లు సిద్ధం చేశాను. అలాంటిది అన్నింటినీ కల్లలు చేశారు. విద్యుత్, కేబుల్, డ్రెయినేజి అన్నీ అండర్ గ్రవుండ్ లోనే ఉండేలా భవిష్యత్తులో రోడ్లు పగులకొట్టే పనే రాకుండా అన్నింటినీ సిద్ధం చేశాం.
అలాంటిది ఇప్పుడు నా మీద కక్షతో అమరావతి అభివృద్దికే గండి కొడతారా..? మీ కక్ష, కార్పణ్యాలకు రాష్ట్ర అభివృద్ది, పేదల సంక్షేమాన్ని బలిపెడతారా..?
భూమి రైతుల వద్దే ఉంటే ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటారా..? టిడిపిపై విసిరే రాళ్లు వైసిపి నేతల నెత్తినే పడతాయనేది గుర్తుంచుకోవాలి.
పనులు అడగాల్సిన ప్రధాని ఎదుట, ప్రతిపక్షంపై ఫిర్యాదులు చేస్తారా..? అవినీతి పరుడి నోట విలువల గురించి, అవినీతి రహిత పాలన గురించి వ్యాఖ్యలా..?
ప్రత్యేక హోదా కోసమే బిజెపిపై పోరాడాం. దేశం మంచి కోసమే ఆర్టికల్ 370పై మద్దతిచ్చాం. రాష్ట్రం, దేశం ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యాంశాలు’’గా చంద్రబాబు పేర్కొన్నారు.