పవన్ కళ్యాణ్ `తమ్ముడు`కి 20 ఏళ్ళు
పవన్ కళ్యాణ్ `తమ్ముడు`కి 20 ఏళ్ళు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. ముఖ్యంగా… యువతలో పవన్‌కున్న క్రేజే వేరు. ఈ క్రేజ్‌కి బీజం వేసిన సినిమాల్లో `తమ్ముడు`(1999)ది ప్రత్యేక స్థానం. కథానాయకుడిగా నాలుగో చిత్రమైన `తొలిప్రేమ`(1998)తో పవన్ కెరీర్ సరికొత్త మలుపు తీసుకుంటే… ఐదో చిత్రమైన `తమ్ముడు` యువతరంలో అతని ఇమేజ్‌ని రెట్టింపు చేసింది. అల్లరిచిల్లరగా తిరుగుతూ తండ్రి చేత ఎప్పుడూ తిట్లు తింటూ ఉండే ఓ యువకుడు… అనూహ్య పరిస్థితుల్లో తన అన్న లక్ష్యాన్ని తన లక్ష్యంగా చేసుకుని ఎలా విజేతగా నిలిచాడు? అనే పాయింట్‌తో `తమ్ముడు` తెరకెక్కగా… ఇందులో రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో పవన్ నటించారు. ప్రథమార్ధంలో బాధ్యతరహితంగా కనిపించే సుభాష్ అలియాస్ సుబ్బుగానూ… ద్వితీయార్ధంలో లక్ష్యం కోసం పోరాడే యువకుడిగానూ పవన్ అభినయం అద్వితీయం.
కేవలం కథానాయకుడిగా నటించడమే కాదు… గాయకుడిగానూ (`తాటిచెట్టు ఎక్కలేవు`, `ఏం పిల్లా` బిట్ సాంగ్స్), స్టంట్ కో-ఆర్డినేటర్‌గానూ వ్యవహరించి మెప్పించారు పవన్. అలాగే, ఈ రెండు శాఖల్లోనూ తనదైన ముద్ర వేశారాయన.
ప్రీతి జింగ్యాని, అదితి గోవిత్రీకర్ కథానాయికలుగా పరిచయమైన ఈ సినిమాతోనే పి.ఎ.అరుణ్ ప్రసాద్ దర్శకుడిగా తొలి అడుగులు వేయగా … రమణ గోగుల బాణీలు అందించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన ఈ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్… 1999 జులై 15న విడుదలైంది. అంటే… నేటితో ఈ సినిమా రిలీజై 20 ఏళ్ళు పూర్తవుతోందన్నమాట.