రక్తసంబంధం చిత్రంలో సొమ్మసిల్లిపోయిన సావిత్రి!
రక్తసంబంధం చిత్రంలో సొమ్మసిల్లిపోయిన సావిత్రి!
అద్భుత నటి సావిత్రి ఎంతో సరదామనిషి. మరెంతో కలుపుగోలు మనిషి, అదేవిధంగా ఆమె చాలా ఎమోషనల్, కొన్ని విషయాలకు ఇట్టే ఎమోషనల్‌కు గురైపోయేవారు. ఆ ఎమోషనల్. కొన్ని విషయాలకు ఇట్టే ఎమోషన్లో ఆమె ఎలా ప్రవర్తిస్తారో ఊహించడానికి వీళ్ళేకుండా ఉండేది. నటనను నటనగా స్వీకరించేవారు కాదామె! ముఖ్యంగా విషాదకరమైన పాత్రలు చేసేటప్పుడు గ్లిజరిన్ లేకుండానే ఏడ్చేసేవారు. ఆ సమయంలో షూటింగ్ చూస్తున్న చూనిట్ సభ్యులు కూడా కన్నీళ్ళు పెట్టుకునేవారు.
తమిళ చిత్రం ఆధారంగా రక్తసంబంధం తెలుగు చిత్రం నిర్మాణమైంది. తమిళంలో శివాజీగణేషన్ అన్నగా చేయగా తెలుగులో రామారావుగారు అన్నగా చేశారు. ముందు తమిళంలో చేస్తున్నప్పుడు ఒక ఎమోషనల్ సీన్లో నటిస్తూ సావిత్రి బీపీ ఎక్కువయిపోయి పడిపోయారు. దాంతో ఆ పూట షూటింగ్ క్యాన్సిల్ చేశారు. తర్వాత ఆ తమిళ చిత్ర దర్శకనిర్మాతలు ఆమెకు నచ్చజెప్పారు. అమ్మా నటనను నటనగానే తీసుకోవాలి తప్ప అంతగా ఎమోషన్‌కు గురై ప్రాణం మీదకు తెచ్చుకోకూడదు అన్నారు. అదే చిత్రం తెలుగులో చేస్తున్నప్పుడు తమిళ దర్శకనిర్మాతలు చెప్పిన జాగ్రత్తలు జ్ఞాపకం తెచ్చుకుని తగినంత మోతాదులో మాత్రమే ఎమోషన్‌ను తెచ్చుకుని జాగ్రత్తగా నటించారు మహానటి.
అలాగే సావిత్ర తెలుగు, తమిళ చిత్రాలు చూసినా చూడకపోయినా ఇంగ్లీషు చిత్రాలు మాత్రం ఆమె తప్పనిసరిగా ఎక్కువగా చూసేవారు. పెళ్ళయ్యాక జెమిని, సావిత్రి కలిసి ఇంగ్లీషు చిత్రాలు చూసేవారు. పెళ్ళయ్యాక ఇద్దరూ పెద్ద స్టార్స్ అయిపోయారు. సినిమాలకు వెళ్ళటం కష్టంగా ఉండేది. ఒక తెలుగు సినిమా చూడాలని అప్పట్లో మౌంట్ రోడ్‌లోని దేవి థియేటర్‌కు వెళ్ళాల్సి వచ్చింది. సావిత్రి ముస్లిం బురఖాను ధరించి, జెమిని మామూలుగా ఇద్దరు కలిసి దేవి థియేటర్లో సినిమా చూశారు. ఆ మరుసటి రోజు పేపర్లో అమ్మాయిలను వెంట వేసుకుని తిరుగుతున్న జెమిని అని పెట్టారు. అది చూసి వారిద్దరూ నవ్వుకున్నారు.