‘Bharateeyudu2’@Rajamahendravaram Central Jail
రాజమహేంద్రవరం జైలులో ‘భారతీయుడు 2’
క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, కథానాయుకుడు కమల్ హాసన్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భారతీయుడు’. 1996లో విడుదలైన ఈ సినిమా ఓ పెను సంచలనం. స్వతంత్ర భారతదేశంలో సామాన్యులను పట్టిపీడిస్తున్న లంచగొండితనంపై ఓ స్వాతంత్య్ర సమరయోధుడు సాగించిన పోరాటమే ‘భారతీయుడు’ సినిమా. సేనాపతి పాత్రలో కమల్ అదరగొట్టారు.
ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ..‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 18 నుంచి ‘ఇండియన్ 2’ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తమిళం, హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
దాదాపు 22 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘భారతీయుడు 2’ సినిమాపై తమిళ ఇండస్ట్రీతో పాటు మిగతా సినీ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ పూర్తిగా సినిమాలను పక్కన పెట్టి తన దృష్టిని రాజకీయాలపై కేంద్రీకరించనుండటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే… కమలహాసన్ కథానాయకుడుగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భారతీయుడు 2’ చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ రాజమహేంద్రవరంలో మొదలైంది. అక్కడి చారిత్రాత్మక సెంట్రల్ జైలులో ప్రస్తుతం కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు.భారతీయుడు సినిమా తీసేందుకు స్పూర్తినిచ్చిన సంఘటన ఏంటో శంకర్ వెల్లడించారు. ‘నేను కాలేజీలో చేరే సమయంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లా.. అక్కడ కొంతమంది అధికారులు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనే నన్ను భారతీయుడు సినిమా తీయడానికి ప్రేరేపించింది’ అని శంకర్ తెలిపారు.
ప్రతి సమస్య సామాన్య ప్రజానీకాన్ని ఏ తీరున ఇబ్బందికి గురిచేస్తుందనే విషయాన్ని ‘ఇండియన్ 2’లో చూపించనున్నట్లు శంకర్ తెలిపారు. చిత్రంలో కమల్ హాసన్ పక్కన కాజల్ అగర్వాల్ నటించనుంది.