Boat accident matter was kept to aside..?
పడవప్రమాదం పక్కకు పెట్టినట్లేనా…?
గోదావరి నదిలో బోటు మునక విషాదం మనసున్న ప్రతి ఒక్కరి గుండెనీ పిండేసింది. వరద ఉధృతి సమయంలో అసలు బోటు ప్రయాణమే నిషేధమయినా దానిని అధికారులు పట్టించుకోకుండా అనుమతించడం, లైఫ్ జాకెట్లు సరిపడా లేకపోవడం, పరిమితికి మించి పర్యాటకులను అనుమతించడం వంటి కారణాలతో, ఇప్పటికి ఎంతోమంది గ ల్లంతయ్యారు. వారిలో దొరికిన మృతదేహాలు ప్రభుత్వ అసమర్థతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి.
మిగిలిన మృతదేహాలు బోటు కిందనే ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నా.. ఇప్పటివరకూ అసలు బోటును బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు ఇంతవరకూ మొదలుపెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో వివిధ వర్గాల నుంచి వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చే వారు కరవయ్యారు.
ప్రధానంగా.. బోటు ప్రమాదం జరిగి ఇన్ని రోజులవుతున్నా, క్షతగాత్రులు ఇళ్లకు వెళ్లి ఇప్పటివరకూ ఆ ప్రమాదానికి కారకులెవరన్న ప్రాధమిక సమాచారం కూడా సేకరించకపోవడం సర్కారు అసమర్థతకు పరాకాష్ఠ. బోటు ఎక్కేముందు అక్కడికి వచ్చిన పోలీసులు అసలు పర్యాటకుల సంఖ్యను లెక్కించారా? లెక్కిస్తే దానిని రికార్డు చేశారా? లెక్కిస్తే అందులో ఎంతమంది ఎక్కారు? వాటిని లెక్కించిన పోలీసులెవరు? బోటుకు అనుమతి ఇచ్చిన అధికారిని హటాత్తుగా బందరుకు ఎందుకు పంపించారు?
పోర్టు అధికారులు ఆ బోటును ఎలా అనుమతించారన్న దిశగా ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం ప్రాధమిక విచారణ కూడా చేపట్టకపోవడం దారుణం. అయితే, ఈ విషాదం నుంచి తప్పుకునేందుకు పోలీసులు అప్పుడే తమ పాత్ర ఏమీ లేదన్న వాదనను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈ కేసు సమాధి అయినట్లే లెక్క.
మొత్తంగా ఈ కేసులో బోటు యజమానిని విలన్గా చూపించే ప్రయత్నాలే జరుగుతున్నాయే తప్ప… అసలు ఆ బోటును అనుమతించిన అధికారి ఎవరన్న దానిని తెరమరుగు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఘటన జరిగిన తర్వాత అక్కడికి వచ్చిన సీఎం జగన్ ఆసుపత్రికి వెళ్లడం, క్షతగాత్రులను పరామర్శించడం, నష్టపరిహారం ఇస్తామని ప్రకటించపడం వరకూ బాగానే ఉన్నా… సంబంధిత అధికారులను ఇప్పటిదాకా శిక్షించకపోవడం విచారకరం.
ఇక ఈ వ్యవహారంపై ప్రతిపక్ష టిడిపి కంటే అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్ చురుకుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఇప్పటివరకూ బోటు ప్రమాదంలో తెరవెనుక వాస్తవాలను బయట ప్రపంచానికి వెల్లడించింది ఆయనే. తాజాగా అసలు బోటులో ఉన్న వారి సంఖ్య 93 మందన్న విషయాన్ని హర్షకుమార్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, బోటు బయటకు తీసుకవస్తే తమ అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే ఆ పని చేయడం లేదని ఆరోపించారు. పోలీసులు తీసిన ఫొటోలు బయటపెట్టాలని, పోర్టు అధికారి ఒక్కో బోటుకు 2 లక్షలు తీసుకుని అనుమతి ఇస్తున్నారన్న ఆరోపణను తెరపైకి తెచ్చి, సర్కారును ముద్దాయిగా నిలబెట్టారు. ఈ విషయంలో హర్షకుమార్ పోషిస్తున్న పాత్ర బాధిత కుటుంబాలకు ఊరట నిస్తోంది.
అయితే విపక్షమైన టిడిపి ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాల్సి ఉండగా, ఆ పార్టీ ఎందుకో చైతన్యరహితంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే బోటు ఘటన మరుసటిరోజునే కోడెల శివప్రసాద్రావు ఆత్మహత్య వ్యవహారం కూడా దానికి కారణం కావచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం ఆ వ్యవహారాన్ని ఉభయ గోదావరి జిల్లా టిడిపి నేతలు కూడా విస్మరించడం చూస్తే.. టిడిపి నేతలు ఆ రెండు జిల్లాల్లో స్తబ్దతగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.