ప్రేక్షకులు నా నుండి కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ వందకి వందశాతం ఇచ్చే చిత్రం వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. అల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి విలేఖరుల సమావేశంలో ‘వాల్తేరు వీరయ్య’ విశేషాలని పంచుకున్నారు. వాల్తేరు వీరయ్యలో వింటేజ్ వైబ్ కనిపిస్తోంది. షూటింగ్ చేస్తున్నపుడు ఆ క్యారెక్టర్ వలన మళ్ళీ యంగేజ్ వైబ్ వచ్చిందా ? ప్రేక్షకులు, అభిమానులు నన్ను కమర్షియల్ సినిమాల్లో చూడటాడానికే ఎక్కువగా ఇష్టపడతారు. నాకు మాత్రం అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేయాలని వుంది. శుభలేఖ, స్వయంకృషి, మంత్రి గారి వియ్యంకుడు లాంటి చిత్రాలు వివిధ్యమైన పాత్రలు చేయాలనే తాపత్రయం నుండి వచ్చినవే. అయితే రానురాను..ఆర్ధికంగా కమర్షియల్ గా ముడిపడిన ఈ పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మేలుని ద్రుష్టిలో పెట్టుకొని.. మనకి ఏం కావాలనేదాని కంటే ప్రేక్షకులు మన నుండి ఏం కోరుకుంటున్నారో.. అది ఇవ్వడానికే మొదటి ప్రాధన్యత ఇచ్చాను. కమ్ బ్యాక్ లో కూడా ఫ్రీడమ్ ఫైటర్ సైరా, పాటలు, హీరోయిన్ లేకుండా పవర్ ఫుల్ పాత్రగా గాడ్ ఫాదర్ చేశాను. ఇవన్నీ కూడా గౌరవప్రదమైన హిట్లు అందుకున్నాయి. అయితే ప్రేక్షకులు నా నుండి ఏం కోరుకుంటున్నారో అది వందకి వందశాతం ఇవ్వాలనే ప్రయత్నంతో వాల్తేరు వీరయ్య చేశాను. ఇది కచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుంది. మరోసారి వింటేజ్ చిరంజీవి ని గుర్తు చేసుకునే అవకాశం వుంటుంది. ముఠామేస్త్రీ, ఘరానామొగుడు, రౌడీ అల్లుడు లాంటి చిత్రాలని రీ కలక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది వాల్తేరు వీరయ్య. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. దీనికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ కూడా. తను ఏం చూడాలని అనుకుంటున్నాడో అవన్నీ నా నుండి రాబట్టుకోవడం కోసం చాలా తపనతో పని చేశాడు. షూటింగ్ చాలా ఉత్సాహంగా జరిగింది. మీరు చాలా అనుభవం గల హీరో.. కొత్త దర్శకులతో పని చేస్తున్నపుడు వారికీ కావాల్సిన ఫ్రీడమ్ ని ఎలా క్రియేట్ చేస్తారు ? నేను ఎప్పుడు మానిటర్ చూడను. నేను షాట్ చేస్తున్నప్పుడు దర్శకుడు ‘ఓకే’ అన్నంతవరకూ అక్కడి నుండి కదలను. నేను ఎప్పుడూ దర్శకుడి ‘ఓకే’ కోసం ఎదురుచూస్తాను. కొత్త యాక్టర్ ని డీల్ చేస్తున్న కంఫర్ట్ దర్శకులకు ఇస్తాను. మొన్న రిటైర్ మెంట్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయంశమయ్యాయి ? కష్టపడే తత్త్వం లేనప్పుడు రిటైర్ మెంట్ తీసుకోవడమే మంచిదని అన్నాను. కెరీర్ మొదట్లో ఒక ఆకలి వుంటుంది. ఒక పేరు తెచ్చుకోవాలి, మనల్ని మనం తెరపై చూసుకోవాలనే స్పిరిట్ .. కొంతకాలం తర్వాత ఎందుకు వుండకూడదు. కష్టపడాలి. అమితాబ్ బచ్చన్ గారు ఇప్పటికీ హార్డ్ వర్క్ చేస్తారు. ఇక్కడ ఎప్పుడూ అర్ద ఆకలితో వుండాలి. కడుపు నిండిన వ్యవహారం లా వుంటే మాత్రం అనుకున్నది డెలివర్ చేయలేవని చెప్పడమే నా ఉద్దేశం. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఏ ఎలిమెంట్ మిమ్మల్ని ఆ ఆకలి, కసితో డెలివర్ చేస్తోంది ? కేవలం ప్రేక్షకుల యొక్క ఆదరణ నా డ్రైవింగ్ ఫోర్స్. వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టే చేయగాలుగుతున్నా. బావగారు బాగున్నారా లో బంగీ జంప్ చేస్తున్నపుడు.. ఇది ప్రేక్షకులు చూస్తే ఎంత ఎక్సయిట్ గా ఫీలౌతారు..వాట్ ఏ ఫీట్ అని క్లాప్స్ కొడతారని ఊహించుకున్న తర్వాత ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. చాలా రిలాక్స్ గా దూకాను. ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ నన్ను ముందుకు నడుపుతుంది. రవితేజలో అప్పటికి ఇప్పటికి ఏం తేడాలు గమనించారు ? రవితేజ అప్పటికి ఇప్పటికి ఒకే మనిషి. ఇమేజ్ వచ్చిన తర్వాత తనలో వచ్చిన మార్పులు ఏమీ లేవు. అదే ఎనర్జీ తో వున్నాడు. తన ఆహారపు అలవాట్లు కూడా మారలేదు. అప్పటికి ఇప్పటికి అదే ప్రేమ, ఉత్సాహం వున్నాయి. వాల్తేరు వీరయ్య లో రవితేజ పాత్ర కథకు మరింత బలం చేకూరుస్తుంది. తన పాత్రలో చాలా ఎమోషన్ వుంటుంది. ఆ పాత్రకు చక్కని న్యాయం చేశాడు. ...