King Nagarjuna, Naga Chaitanya’s Bangarraju Pressmeet Photos
పండుగలాంటి బంగార్రాజు సినిమాను జనవరి 14న విడుదల చేస్తున్నాం.. – కింగ్ నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా జనవరి 14న రాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. బంగార్రాజు సినిమా విడుదల తేదీని ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో..
కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘చాలా మంది బిజీ ఆర్టిస్ట్‌లు ఇందులో నటించారు. వెన్నెల కిషోర్ గారి డేట్స్ దాదాపు రెండు నెలలు ఫుల్లుగా ఉన్నాయి. కానీ మాకు దొరికాయి. అనూప్ రూబెన్స్ ఇచ్చిన ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయి. సోగ్గాడు చిన్ని నాయన సినిమాను అంతా చూశారు. ఆ సమయంలోనే సీక్వెల్ చేద్దామని అన్నారు. ఫస్ట్ డే సినిమా చూసిన వెంటనే సీక్వెల్ చేద్దామని అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాటల ఫలితమే ఈ సినిమా. కృతి శెట్టితో పని చేయడం చాలా కష్టం. బుక్ తెచ్చుకుంటుంది. ప్రతీది ప్రశ్నలు వేస్తుంది. కంఫర్ట్ జోన్లోకి వస్తే పాత్రకు ఏం కావాలో అది చేస్తుంది. సోగ్గాడే చిన్న నాయన సినిమాలోకి ముందు ప్రసాద్ గారు వచ్చారు. ఆ తరువాతే నేను వచ్చాను. ఆయన నాకు సోదరుడిలాంటి వారు. నాగ చైతన్య గారు ఏ సినిమాకు ఆ సినిమాకు కొత్తగా కనిపిస్తారు. కానీ ఇందులో మరింత కొత్తగా కనిపిస్తారు. చై నటనకు అందరూ పదింతలు క్లాప్స్ కొట్టారు. మేం ఎంత ఎగ్జైట్ అయ్యామో.. ప్రేక్షకులు కూడా అంతే ఎగ్జైట్ అవుతారు. రమ్యకృష్ణ గారు అద్భుతంగా నటించారు. కామెడీ సీన్లు చేసిన వెంటనే సీరియస్ సీన్లు చేసేవారు. ఎంత ఆలస్యమైనా కూడా మాకు సహకరించారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఈ సినిమాను వదల్లేదు. అలా అని త్వరగా పూర్తి చేసేయాలని తొందరపడి చేయలేదు. సినిమాలో ప్రతీ ఎమోషన్ ఉంటుంది. నాగార్జున, నాగ చైతన్య గారికి సమానమైన సన్నివేశాలుంటాయి. ప్రేక్షకుల అంచనాలను మించేలా ఉంటుంది. వచ్చిన జనాలను మెప్పించేలా ఉంటుందనే పండుగలాంటి సినిమా అని పెట్టాం’ అని అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ.. ‘పండుగలాంటి సినిమా అని ముందు నుంచి అంటూనే వస్తున్నాం. రిలీజ్ డేట్‌ను ఎందుకు అనౌన్స్ చేయలేదని అందరూ అనుకుంటారు. ఇంత పెద్ద సినిమాను టైంకు రిలీజ్ చేయగలమా? లేదా? అని అనుకున్నాం. కానీ నిన్ననే మా సినిమా డేట్‌ను ఫిక్స్ అయ్యాం. మా టీం అంతా కూడా సంక్రాంతికి రావాలని నిర్ణయించుకున్నాం. సోగ్గాడే చిన్ని నాయన సినిమా కూడా జనవరి 14నే వచ్చింది. అన్ని పరిస్థితులు బాగుంటే మా సినిమా జనవరి 14న రానుంది. ఇందులో ఏదో సూపర్ పవర్ ఉంది. ఇంత త్వరగా సినిమా ఎలా కంప్లీట్ చేశారో నాకు తెలియడం లేదు. ఇందులో ఎంతో వీఎఫ్ఎక్స్ ఉంది. సినిమా విడుదలై సక్సెస్ అయిన తరువాత అందరికీ థ్యాంక్స్ చెబుతాను. నా టీం చేసిన కృషి వల్లే ఈ రోజు ఇలా విడుదల తేదీని ప్రకటిస్తున్నాం. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా బాగా తీశాం. అందరికీ ఈ ఏడాది బాగుండాలి. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ పాన్ ఇండియన్ సినిమాలు. వాటిని ప్రపంచమంతా కూడా చూడాలి. అవి పోస్ట్ పోన్ అవ్వడం బాధగా ఉంది. వారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సంక్రాంతికి కనీసం మూడు నాలుగు సినిమాలు రావాలి. అన్నీ ఆడాలి. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ఉన్నా కూడా మా సినిమాను విడుదల చేసేవాళ్లం. నా కెరీర్‌కు ప్రెసిడెంట్ గారి పెళ్లాం, జానకి రాముడు ఎలా ప్లస్ అయ్యాయో.. నాగ చైతన్యకు ఈ చిత్రం కూడా అలా హెల్ప్ అవుతుంది. నేను ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆలోచనలతోనే ముందుకు వెళ్తాను. ఇప్పుడే నెగెటివ్ ఆలోచనలు వద్దు. ముందు విడుదల తేదీని ప్రకటిద్దాం. ఆ తరువాత ఏం జరుగుతుందో ఆ దేవుడే చూసుకుంటాడు. నంబర్ గేమ్స్‌ను నమ్మడం నేను ఎప్పుడో మానేశాను. ప్రతీ ఏడాది అవి మారుతూనే ఉంటాయి. నాగ చైతన్య డబ్బింగ్లో బిజీగా ఉండటం వల్లే ఇక్కడకు రాలేకపోయాడు’ అని అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ‘మనం, సోగ్గాడే చిన్ని నాయన తరువాత చేస్తోన్న మూడో చిత్రం. ఈ సినిమాకు చాన్స్ ఇచ్చినందుకు నాగార్జున గారికి థ్యాంక్స్. ఆయనతో పని చేసిన ప్రతీ సారి కొత్త అనుభూతికి లోనయ్యాను. నా ఫ్రెండ్ కళ్యాణ్ కృష్ణ, నేను కలిసి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఇంకా బాగుండాలని ప్రయత్నించాం. లడ్డుండా, వాసివాడి తస్సాదియ్యా పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సంక్రాంతికి బంగార్రాజు రాబోతోంది. అందరూ సినిమాను ప్రేమిస్తారని ఆశిస్తున్నాను. డిక్క డిక్క డుం డుం అనే పాటను నాగ్ సర్‌తో పాడించాం. ఇందులో కూడా పాడించాలని అనుకున్నాం. పాట విన్నాక మొత్తం పాడేస్తాను అని అన్నారు. నాగార్జున గారికి థ్యాంక్స్’ అని అన్నారు.
కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘నాగార్జున గారి ఎనర్జీ ఎవ్వరితోనూ మ్యాచ్ చేయలేం. ఆయన నిజంగానే కింగ్. చైతన్య గారితో పని చేయడం ఎంతో సులభం. నేను జూనియర్ అని ఎక్కడా ఫీలయ్యేలా ప్రవర్తించలేదు. సర్పంచ్‌గా నాగలక్ష్మీ పటాకాల అనిపస్తుంది. పాత్రను ఎంజాయ్ చేస్తూ నటించాను. బంగార్రాజు పండుగలాంటి సినిమా. పండుగకే వస్తుంది. జనాలు మళ్లీ నన్ను ప్రేమిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో చాలా ఆర్ట్ వర్క్ ఉంది. తక్కువ టైంలో చేశాను. అయినా అందరూ సపోర్ట్ చేశారు. మా టీంకు, నాగార్జున గారికి, డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.
జీ అధినేత ప్రసాద్ మాట్లాడుతూ.. ‘బంగార్రాజు సినిమా ఆఫర్ రావడంతో ఇది నిజంగానే బంగారం లాంటి సినిమా అనుకున్నాం. సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్‌గా రాబోతోంది. నాగార్జున గారు, నాగ చైతన్య కలిసి నటించడంతో ఇంకా ప్రతిష్టాత్మకంగా మారింది. మేం అంతా కూడా జనవరి 14 కోసం ఎదురుచూస్తున్నాం. సినిమాను అందరూ థియేటర్లోనే చూడండి’ అని అన్నారు