Kutti Radhika’s Samhaarini grand teaser release

ఐదు భాషల్లో కుట్టి రాధిక `సంహారిణి` టీజర్ భారీ రిలీజ్
నటించిన తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న మేటి కథానాయిక కుట్టి పద్మిని. ప్రతిభకు నిలువెత్తు దర్పణం. ఇయర్కై అనే బహుభాషా చిత్రంతో తెరకు పరిచయమవ్వడమే గాక .. ఈ చిత్రంతో దర్శకుడు ఎస్పీ జననాధన్ జాతీయ అవార్డ్ అందుకోవడం సంచలనమైంది. పద్మిని పేరు అద్భుత పెర్ఫామెన్సెస్ తో సౌతిండస్ట్రీలో మార్మోగింది. నటిగా చక్కని పేరు తెచ్చుకున్న ఈ కన్నడ భామ అటుపై తమిళంలో శ్రీకాంత్ సరసన `మీసై మాధవన్`, `సొల్లట్టుమా` తదితర చిత్రాల్లో నటించారు. కన్నడలో కొన్ని క్రేజీ చిత్రాల్లో నటించి భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆ సమయంలోనే కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రహస్య వివాహం చేసుకోవడం సంచలనమైంది. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పి కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. రాధిక కుమార స్వామిగా పాపులారిటీని సంపాదించారు.
ఇటీవలే నటిగా రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించారు రాధిక. సౌత్ లో అన్ని భాషల్లో నటించేందుకు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లో చారిత్రక నేపథ్యం ఉన్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దమయంతి అనే టైటిల్ ని నిర్ణయించారు. అరుంధతి, భాగమతి తరహా భారీ హారర్ థ్రిల్లర్ చిత్రమిది. నవరసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని తెలుగులో `సంహారిణి` పేరుతో రిలీజ్ చేయనున్నారు. శ్రీ లక్ష్మి వృషాద్రి ప్రొడక్షన్స్ సమర్పణలో జీఈ గీతా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సంహారిణి టీజర్ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రంలో అనుష్క నటించాల్సింది. ఆ తర్వాత రాధికకు ఈ అవకాశం దక్కింది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలో సంహారిణిగా రాధిక అద్భుతంగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఆర్.ఎస్.గణేష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పీ.కె.హెచ్ దాస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: మహేష్, దర్శకత్వం: నవరసన్.