Naandhi movie opening
అల్లరి నరేష్ హీరోగా షూటింగుకు ‘నాంది’
అల్లరి నరేష్ కథానాయకుడిగా ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ‘నాంది’ చిత్రం షూటింగ్ సోమవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరచయమవుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రధారులు. దేవుని పటాలకు నమస్కరిస్తున్న నరేష్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ హరీష్ శంకర్ క్లాప్ నివ్వగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేశారు.
హీరో నరేష్ మాట్లాడుతూ “ఇప్పటివరకూ నేను పనిచేయని కొత్తవాళ్లతో ఈ సినిమాకి పనిచేస్తున్నాను. ఎప్పటినుంచే నేను పనిచేయాలనుకుంటున్న రచయిత అబ్బూరి రవితో తొలిసారి పనిచేస్తున్నా. ఇదొక క్రైం థ్రిల్లర్. ఇంటెన్స్ ఫిల్మ్. కామెడీ జోనర్ కాకుండా మళ్లీ ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. దీంతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని ఆశిస్తున్నా” అని చెప్పారు.
దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ “ఇదొక సోషల్ ఎలిమెంట్ మిక్స్ చేసిన క్రైం థ్రిల్లర్. కొత్తదని చెప్పను కానీ కచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది” అన్నారు.
నిర్మాత సతీష్ వేగేశ్న మాట్లాడుతూ “తొలిసారి ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్నాను. నాకు చాలా ఇష్టులు, సన్నిహితులైన ఈవీవీ గారబ్బాయి నరేష్ తో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఒక కొత్త స్టోరీతో ఈ సినిమా మొదలుపెట్టాం. జనవరి 27 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. మార్చి 17 నాటికల్లా పూర్తి చేసి, వేసవిలో చిత్రాన్ని విడుదల చేద్దామనుకుంటున్నాం. బ్రహ్మాండమైన టీం కుదిరింది” అని చెప్పారు.
మాటల రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ “నరేష్ గారితో పని చెయ్యాలని ఎప్పట్నుంచో నా కోరిక. ఈవీవీ గారి ‘హలో బ్రదర్’ను 50 కంటే ఎక్కువసార్లు చూశాను. అలాగే నరేష్ గారి ‘గమ్యం’ సినిమా ఎన్నిసార్లు చూసుంటానో తెలీదు. దర్శకుడు విజయ్ కు తన కథమీద ఫోకస్, విజన్ ఉన్నాయి. నిర్మాత మంచి కథను ఎంచుకున్నారు. నరేష్ తన జోనర్ ను మార్చుకుని ఈ సినిమా చేస్తున్నారు. ఆయన ఫస్ట్ లుక్ అదిరిపోయింది” అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ “నేను ఈవీవీ గారికి పెద్ద అభిమానిని. తొలిసారి నరేష్ గారితో పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది” అన్నారు.
ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.వి.ఎల్. నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్ రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి, మణిచందన, ప్రమోదిని తారాగణమైన ఈ చిత్రానికి కథ: తూం వెంకట్, మాటలు: అబ్బూరి రవి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: సిద్, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: వెంకట్, పీఆర్వో: వంశీ-శేఖర్, పబ్లిసిటీ డిజైనర్: సుధీర్, స్టిల్స్: సాయిరాం మాగంటి, కో-డైరెక్టర్: బూరుగుపల్లి సత్యనారాయణ, లైన్ ప్రొడ్యూసర్: రాజేష్ దండ, నిర్మాత: సతీష్ వేగేశ్న, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల.