Seetimaarr Success meet Photos
‘సీటీమార్’ తో నాకు, నా నిర్మాతలకు ఇంత పెద్ద సూపర్ హిట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు: సక్సెస్‌మీట్‌లో ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ కమర్షియల్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదలై విజయవంతమైంది. ఈ సందర్భంగా మంగళవారం సినిమా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, చిత్ర దర్శకుడు సంపత్ నంది, హీరోయిన్ తమన్నా, నిర్మాతలు శ్రీనివాసా చిట్టూరి, పవన్‌కుమార్, లిరిసిస్ట్ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా రిలీజ్ రోజున వినాయకుడి ఆశీస్సులతో సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుందని చెప్పాను. అన్నట్లుగానే సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. సినిమా తప్పకుండా ప్రేక్షకులను థియేటర్‌కు తీసుకొస్తుందనే గట్టి నమ్మకంతో అన్నాను. వినాయక చవితిరోజున సినిమాను విడుదల చేశాం. వినాయకుడు సీటీ కొట్టుకుంటూ వచ్చి థియేటర్స్‌కు రమ్మని పిలిస్తే ప్రేక్షకులు వచ్చి మాకు చాలా పెద్ద విజయాన్ని అందించారు. ఈ సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్. పాండమిక్ టైమ్‌లో షూటింగ్ చేయడమంటే, మనసులో తెలియని ఓ భయం ఉంటుంది. అయినా కూడా ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడి చేశారు. ఈ సినిమాలో అమ్మాయిల కబడ్డీ జట్టుగా నటించిన అమ్మాయిలు ఎన్నో బాధలను అధిగమించి ఈ స్టేజ్‌కు వచ్చారు. ఈరోజు వాళ్లు స్క్రీన్‌పై కనిపించినప్పుడు క్లాప్స్ కొడుతున్నారంటే కారణం, వాళ్ల తల్లిదండ్రుల పడ్డ కష్టమే. ఈరోజు వాళ్ల కుటుంబ సభ్యులు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఫైట్స్‌కు ఈరోజు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. అందుకు సంపత్ డిజైనింగ్ ఓ కారణమైతే, వెంకట్, స్టంట్ శివ మాస్టర్స్ దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. ప్రేక్షకులు నానుంచి ఎలాంటి ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేశారో అలాంటి ఫైట్స్ అందించారు. ఇక మణిశర్మగారి గురించి చెప్పాలంటే.. ప్రీ రిలీజ్లో చెప్పాను. ఆయనతో ఏడు సినిమాలకు వర్క్ చేస్తే, ఆరు సూపర్‌హిట్స్ ఉన్నాయని. ఇది మా కాంబినేషన్లో వచ్చిన ఎనిమిదో సినిమా. ఇది కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అద్భుతమైన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మణిగారికి థాంక్స్. ఆయనతో వర్క్ చేస్తుంటే, మ్యూజిక్ పరంగా ఆయన చూసుకుంటారులే అనే ధైర్యం ఉంటుంది. గౌతమ్ నంద తర్వాత సౌందర్ రాజన్‌తో కలిసి చేసిన సినిమా. ఆ సినిమా చూసి నాకు నేనే ఇంత అందంగా ఉన్నానా? అనిపించింది. ఈ సినిమాలో ఇంకా అందంగా నన్ను చూపించాడు సౌందర్. దర్శకుడు సంపత్‌కు ఏం కావాలో సౌందర్ రాజన్‌కు తెలుసు. సంపత్‌కు ఏం కావాలో దాని కంటే ఎక్కువ ఔట్‌పుట్టే ఇచ్చాడు. తమన్నాతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటే.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వంటి కారణాలతో కుదరలేదు. ఈ సినిమాలో కుదిరింది. తను బోల్డ్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది. తను మంచి డాన్సర్. రావు రమేశ్‌గారు, పోసానిగారు, తరుణ్ అరోరాగారు, భూమికగారు, రెహమాన్‌గారు..ఇతర కో ఆర్టిస్టులు అందరూ చక్కగా నటించి సపోర్ట్ అందించారు. డైరెక్టర్ సంపత్తో గౌతమ్‌నంద చేశాం. ఆ సినిమాను చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఎందుకో ఆ సినిమాతో అనుకున్నది రీచ్ కాలేకపోయాం. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు ముందు ఒక స్టోరి అనుకున్నాం. కానీ వర్కవుట్ కాదనుకున్నాం. రెండు నెలల తర్వాత సంపత్ ఈ స్టోరితో వచ్చాడు. చాలా మంచి స్టోరి కుదిరిందని అనుకున్నాను. చాలా డిస్కస్ చేసుకున్నాం. మధ్యలో పాండమిక్ వచ్చింది. ఈ గ్యాప్‌లో సంపత్ స్టోరిని ఇంకా బెటర్‌మెంట్‌గా మార్చాడు. ఈ సినిమా అయితే చాలా కష్టమైపోతుందనే భయం ఇద్దరికీ ఉండేది. కానీ ఏమైనా ఈ సినిమా మిస్ కాకూడదని అనుకున్నాం. నేను జెన్యూన్‌గా హిట్ అనే మాట విని చాలా కాలమైంది. అంతకు ముందు హిట్స్ వచ్చాయి. కానీ, ఈ మధ్య కాలంలో నా సినిమాలను హిట్ అని విన్లేదు. కానీ సినిమా కొరత తీర్చేసింది. నేను హిట్స్, ప్లాప్స్ చూశాను. నా సినిమా హిట్టా, ప్లాపా అని నా ఫోన్ చెప్పేస్తుంది. ఇంకొకరు చెబితే నేను వినను. హిట్ సౌండ్ ఎలా ఉంటుంది? ప్లాప్ సౌండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నిర్మాతలు శ్రీనివాస్ చిట్టూరి, పవన్‌గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ల పడ్డ కష్టానికి ఈరోజు ఇంత పెద్ద హిట్ వచ్చింది. నా నిర్మాతలకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్.. ప్రేక్షకులకు పేరు పేరునా చేతులెత్తి దండం పెడుతున్నాం. ఈ నిర్మాతలు ఇంకా మంచి సినిమాలు తీసి పెద్ద ప్రొడ్యూసర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సంపత్ కూడా ఈ హిట్‌తో ఆపకుండా ఇంకా పెద్ద హిట్ మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
చిత్ర దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ ‘‘‘సీటీమార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున, సక్సెస్‌మీట్‌లో మాట్లాడుతానని చెప్పాను. ఈరోజు నా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పుకోవాలి. వినాయక చవితిరోజున విడుదలైన మా ‘సీటీమార్’ చిత్రాన్ని ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో ఉండే లడ్డంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో మనకు దగ్గరైన వాళ్లని కోల్పోయాం. ఈ సినిమాకు వర్క్ చేసిన టీమ్‌లోనూ కొంత మందిని మేం కోల్పోయాం. ఐదు నెలల తర్వాత థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమాను, ప్రేక్షకులు ప్రాణాలను రిస్క్‌లో పెట్టి పెద్ద హిట్ చేశారు. సాధారణంగా నేను డైరెక్ట్ చేసిన ఏ సినిమా అయినా సరిగా ఆడకపోతే, ఆ తప్పు నాదేనని చెబుతాను. అదే సినిమా పెద్ద హిట్ అయితే నా టీమ్‌కు ఆ సక్సెస్ క్రెడిట్ దక్కుతుందని కూడా చెబుతుంటాను. ‘సీటీమార్’ సక్సెస్‌లో ముందుగా నేను మాట్లాడాల్సింది మణిశర్మగారి గురించి. ఈ సినిమాలో నాలుగు సక్సెస్ఫుల్ పాటలను ఆయన అందించారు. సాధారణంగా అందరరూ ఆయన్ని మెలోడి బ్రహ్మ అని అంటుంటారు. కానీ నేను మాత్రం ఆయన్ని మాస్ కా బాస్.. బీజీఎం కా బాద్షా అని అంటుంటాను. దీన్ని ఆయన మరోసారి ప్రూవ్ చేశారు. తర్వాత ఫైట్ మాస్టర్స్ గురించి చెప్పుకోవాలి. నేను డిజైన్ చేసుకున్న యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా సిల్వర్ స్క్రీన్‌పై వచ్చేలా చేసిన స్టంట్ శివగారు, వెంకట్‌గారు, జాషువాగారు, రియల్ సతీశ్‌గారికి థాంక్స్. సౌందర్‌రాజన్ నాతో ఐదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు. నా కన్ను ఆయనే. నేను ఏదైనా ఊహిస్తే దాన్ని అంత కంటే గొప్పగా ప్రెజెంట్ చేశారు. ఆయన నాకు మెయిన్ పిల్లర్. ఎడిటర్ తమ్మిరాజుగారికి, ఆర్ట్ డైరెక్టర్ సత్యనారాయణగారికి, డాన్స్ మాస్టర్ శోభిమాస్టర్గారికి స్పెషల్ థాంక్స్. నా రైటింగ్ టీమ్‌కు, ధనిఏలేగారికి, డైరెక్షన్ టీమ్‌కు మనస్ఫూర్తిగా థాంక్స్. ఫస్టాఫ్‌లో రావు రమేశ్‌గారు తనదైన డైలాగ్ డెలివరీతో హీరోకు సపోర్ట్ చేస్తూ సినిమాను నిలబెడితే, సెకండాఫ్‌లో సినిమాకు హార్ట్‌గా నిలిచిన యాక్టర్ పోసాని కృష్ణమురళిగారు సహా ఇతర ఆర్టిస్టులకు థాంక్స్. గౌతమ్ నంద సమయంలో నేను, గోపీచంద్‌గారు ఓ బ్లాక్‌బస్టర్ సినిమా తీస్తున్నామని అనుకున్నాం. కానీ ఎందుకో ఆ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ కాలేకపోయింది. కానీ ‘సీటీమార్’ తో గోపీచంద్‌గారి బాకీ తీర్చేసుకన్నాను. సినిమా తొలి ఆట తర్వాత సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి సింహా అప్పుడు బాలకృష్ణగారు, బోయపాటిగారు ఎలాంటి హిట్ కొట్టారు. ఇప్పుడు గోపీచంద్‌గారు, మీరు అంత పెద్ద బ్లాక్‌బస్టర్ కొట్టారని అన్నాడు. ఇక జ్వాలా రెడ్డి వంటి పాత్రను గుర్తుండిపోయేలా చేసిన తమన్నాకు థాంక్స్. నిర్మాతలు శ్రీనివాస్ చిట్టూరి, పవన్‌గారి వల్లే ఈరోజు ఇలా సక్సెస్‌మీట్‌లో నిలబడి మాట్లాడుతున్నాం. కథ చెప్పిన రోజే మేమున్నాం అని మా వెనుక నిలబడ్డారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు అలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. వారిద్దరికీ మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను. ఇది కేవలం మాస్, కమర్షియల్ సినిమా మాత్రమే కాదు.. స్త్రీ సాధికారత గురించి, అమ్మాయిలు పడే ఇబ్బందులు వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఎంకరేజ్మెంట్ గురించి చెప్పే సినిమా. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉందంటుంటారు. కానీ వాళ్లు ఎప్పుడూ వెనుకే ఎందుకు ఉండాలి. వాళ్లు ముందుకు రాకూడదా? విజయాలు సాధించకూడదా? అని చెప్పి వాళ్ల విజయాల కోసం వెనకాల నిలబడ్డ ఒక మగవాడి కథే ఈ సినిమా. ఆడవాళ్ల విజయం కోసం నిలబడ్డ ఓ అన్నయ్య కథే ఈ సీటీమార్. మీరు వందరూపాయలు పెట్టి ఈ సినిమా చూస్తే వెయ్యి రూపాయల ఆనందాన్నిచ్చే సినిమా ఇదని మనస్ఫూర్తిగా, నమ్మకంతో చెబుతున్నాను. సాధారణంగా జై జవాన్, జై కిసాన్ అంటుంటారు. కానీ ఓ అమ్మ ప్రేమ తెలిసిన వ్యక్తిగా, బార్య ప్రేమ తెలిసిన వ్యక్తిగా, కూతురి ప్రేమ తెలిసిన వ్యక్తిగా చెబుతున్నాను. జై ఔరత్, జీయో ఔరత్ అని చెబుతున్నాను’’ అన్నారు.
మిల్కీబ్యూటీ తమన్నా మాట్లాడుతూ ‘‘2019లో ‘సీటీమార్’ సినిమాను స్టార్ట్ చేశారు. తర్వాత ప్యాండమిక్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి. అన్నీ సమస్యలు తర్వాత ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఓ బ్లాక్‌బస్టర్ సినిమా తీయాలనే కోరిక ఈ సక్సెస్‌కు కారణం. సంపత్‌గారితో నేను చేసిన మూడో సినిమా. మంచి కథను ఎంటర్టైనింగ్గా చెప్పే దర్శకుడు సంపత్‌గారు. ఇది మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. నాకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్. ఈ సినిమాలో 24 మంది హీరోయిన్స్ ఉన్నారు. ఈ మూవీలో కబడ్డీ ఆడిన అమ్మాయిలు ఎంత హార్డ్ వర్క్ చేశారో చూశాను. ఈ సినిమా కోసం గోపీచంద్‌గారు ఎంతో కష్టపడ్డారు. జ్వాలారెడ్డి సాంగ్‌లో వెన్ను నొప్పి ఉన్నా కూడా గోపీచంద్‌గారు అద్భుతంగా డాన్స్ చేశారు. నిర్మాతలు శ్రీనివాస్‌గారు, పవన్‌గారికి థాంక్స్. ప్యాండమిక్ టైమ్ తర్వాత షూటింగ్స్ స్టార్ట్ కావడంతో సినిమా ప్రమోషన్స్‌కు హాజరు కాలేకపోయాను. అందుకు నిర్మాతలకు సారీ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ నాకెంతో ముఖ్యం. వినాయచవివితో పాటు సీటీమార్ హవా కూడా నడుస్తుంది. అందరూ ఎంజాయ్ చేయండి’’ అన్నారు.