Sri Talasani Srinivas Yadav Photos
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే వైకుంఠ ఏకాదశి కి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్బంగా కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని జియాగూడ లో గల శ్రీ రంగనాధ స్వామి కి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ముందుగా ఆలయ పండితులు మంత్రి దంపతులకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఎంతో పవిత్రంగా జరుపుకొంటారని తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన జియాగూడ లోని రంగనాధ స్వామి దర్శనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారని చెప్పారు. వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ వస్తుందని అన్నారు. ఈ సంవత్సరం కూడా ఘనమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ పరిసరాలను భక్తులను ఆకర్షించే విధంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలకరించడం జరిగిందని అన్నారు. భక్తులు ఎక్కడ తోపులాటకు గురికాకుండా భారికేడ్ ల ఏర్పాటు తో పాటు త్రాగునీరు అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా హెల్త్ క్యాంప్ లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, స్థానిక ప్రజలకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఆలయ పండితులు శేషాచారి తదితరులు ఉన్నారు.