Srinivas Yadav Minister for Animal Husbandry inspected the development works in Sanathnagar
సనత్ నగర్ లోని హరిశ్చంద్ర ఘాట్ (ESI స్మశాన వాటిక) ను మహా ప్రస్తానం తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
శుక్రవారం సనత్ నగర్ డివిజన్ లోని జెక్ కాలనీలో నూతనంగా నిర్మించిన పార్క్, విద్యుత్ సబ్ స్టేషన్, 1.9 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సనత్ నగర్ నెహ్రూ పార్క్ సుందరీకరణ, అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరిశ్చంద్ర ఘాట్ కు ప్రతినిత్యం అంత్యక్రియల కోసం మృతదేహాలు పెద్ద సంఖ్య లో వస్తుంటాయని చెప్పారు. అక్కడకి వచ్చే వారికి కావాల్సిన సౌకర్యాలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించి అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వీలైనంత త్వరలో హరిశ్చంద్ర ఘాట్ ను సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జెక్ కాలనీ పార్క్, నెహ్రూ పార్క్ లలో మొత్తం కలియతిరిగి అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. మంత్రి వచ్చే సమయానికే పార్క్ లో ఉన్న చిన్నారులతో మంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. రోడ్డు ఇరుకుగా ఉండటం వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయని, రోడ్డు వెంట ఉన్న సబ్ స్టేషన్ కు చెందిన స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం కేటాయించాలని TSSPDCL CMD రఘుమారెడ్డి ని ఫోన్ చేసి కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. సబ్ స్టేషన్ లో మంత్రి TSSPDCL డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో స్థలం కేటాయింపు పై చర్చించారు. విద్యుత్ కేబుల్స్ తొలగింపు, స్థంబాల తొలగింపు వంటి పనులను పూర్తి చేసి వారం రోజులలో స్థలం అప్పగిస్తామని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మంత్రికి వివరించారు. స్థలం అప్పగించిన వెంటనే సబ్ స్టేషన్ కు, పక్కనే ఉన్న పార్క్ కు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సనత్ నగర్ ప్రాంతంలో పెరిగిన జనాభా, ఇండ్లు, పరిశ్రమల అవసరాల దృష్ట్యా నూతన సబ్ స్టేషన్ ను నిర్మించాల్సిన అవసరం ఉందని, అందుకు స్థలం కావాలని కోరగా, స్పందించిన మంత్రి స్థలం కేటాయింపు, సబ్ స్టేషన్ నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉన్నదన్నారు. సనత్ నగర్ మెయిన్ రోడ్ అభివృద్ధి, విస్తరణ పనులు వారం రోజులలో ప్రారంభం అవుతాయని చెప్పారు. నిత్యం ఎంతో రద్దీగా ఉండటం, వారాంతపు సంత నిర్వహణతో వాహనదారులు, స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికే రోడ్డు, పుట్ పాత్ ల వెంట ఆక్రమణలను తొలగించడం జరిగిందని, మిగిలిన ఆక్రమణలను కూడా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. డివైడర్ ల నిర్మాణం కోసం నిధులు మంజూరైనాయని వారం రోజులలో పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అక్కడి నుండి నెహ్రూ పార్క్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్క్ లో ఆకర్షణీయంగా ఉండే మంచి మంచి మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంతో అద్బుతంగా పార్క్ ను నిర్మించడం పట్ల స్థానిక ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంట కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, జెక్ కాలనీ అసోసియేషన్ అద్యక్షులు సూర్య శంకర్ రెడ్డి, DC మోహన్ రెడ్డి, EE ఇందిర, ఎలెక్ట్రికల్ DE సుదీర్, హార్టికల్చర్ DD శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ACP రమేష్, వాటర్ వర్క్స్ GM హరి శంకర్ తదితరులు ఉన్నారు.