Supriya Sahu IAS Tamil Nadu visited Telangana to Study Telangana Ku Haritha Haram program
తెలంగాణకు హరితహారం అద్భుత కార్యక్రమం, ఆదర్శనీయం*
*హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ఫలితాలు సాధించింది*
*తమిళనాడులోనూ గ్రీన్ మిషన్ పేరుతో ప్లాంటేషన్ కార్యక్రమం అమలు*
—- తెలంగాణలో పర్యటించిన తమిళనాడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియా సాహు—-
తెలంగాణకు హరితహారం అద్భుతమైన కార్యక్రమం అని, గత ఎనిమిదేళ్లుగా ఈ పథకం అమలు చేస్తూ గణనీయమైన పచ్చదనం రాష్ట్రం సాధించిందని కొనియాడారు తమిళనాడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ (అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ) సుప్రియా సాహు.
తెలంగాణకు హరితహారం తరహాలోనే తమిళనాడు గ్రీన్ మిషన్ అనే కార్యక్రమం అమలు చేయటం ద్వారా 33 శాతం పచ్చదనం సాధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హరితహారం కార్యక్రమాన్ని అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారి సుప్రియా సాహు తెలంగాణలో పర్యటించారు.
ముందుగా అరణ్య భవన్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, అధికారులతో సాహూ సమావేశం అయ్యారు. గత ఎనిమిదేళ్లుగా హరితహారం అమలు, ఫలితాలపై పీసీసీఎఫ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటయ్యాక పచ్చదనం పెంపును ఒక ప్రాధాన్యతా పథకంగా (ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్) ప్రభుత్వం అమలు చేసిందని, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పట్టుదలతో కార్యక్రమం అమలును పర్యవేక్షించారని అధికారులు వివరించారు.
ఆ తర్వాత అధికారుల బృందం దూలపల్లి, శంషాబాద్ నర్సరీలు, కండ్లకోయ ఆక్సీజన్ పార్క్, సిరిగిరిపురం, నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను, ఔటర్ రింగ్ రోడ్డు గ్రీనరీని పరిశీలించారు. నర్సరీల నిర్వహణతో పాటు, పచ్చదనం పెంచిన తీరు అద్భుతంగా ఉందని, అవెన్యూ ప్లాంటేషన్ (రహదారి వనాలు), అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఔటర్ వెంట పచ్చదనం తీర్చిదిద్దిన విధానం చాలా బాగుందని సాహు తెలంగాణ అటవీ శాఖను, అధికారులను అభినందించారు. మిగతా శాఖలతో పాటు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలతో సమస్వయం చేసిన విధానం అడిగి తెలుసుకున్నారు. త్వరలో తెలంగాణ అధికారుల బృందాన్ని తమిళనాడుకు అహ్వానిస్తామని, తమ అధికారులకు హరితహారం అమలు తీరును వివరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. పర్యటనలో తాను తీసుకున్న ఫోటోలను, వీడియోలను సాహూ స్వయంగా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. కొద్ది గంటల్లోనే ఆమె పోస్ట్ వైరల్ అయింది.
సుప్రియా సాహూ వెంట తమిళనాడు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ఆనంద్ ఉన్నారు. క్షేత్ర పర్యటనలో చీఫ్ కన్జర్వేటర్ (సోషల్ ఫారెస్ట్రీ) రామలింగం, రంగారెడ్డి, మేడ్చల్ డీఎఫ్ఓలు జాదవ్ రాహుల్ కిషన్, జానకి రాములు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
(రాష్ట్రంలో పచ్చదనం పెంపు, 33 శాతం గ్రీనరీ సాధించటమే లక్ష్యంగా ఎనమిదేళ్లుగా తెలంగాణకు హరితహారం అటవీశాఖ అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీయార్ మానస పుత్రికగా హరితహారం కార్యక్రమం పేరొందింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం ప్రశంసలు అందుకుంది. అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు హరితహారం అమలును అధ్యయనం చేసి, ప్రశంసించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు కార్యక్రమాన్ని మెచ్చుకుంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం తెలంగాణలో పచ్చదనం 6.7 శాతం పెరిగింది. ఇటీవలే ప్రపంచ గ్రీన్ సిటీ అవార్డును కూడా హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, తదితర రాష్ట్రాల తమ అధికారుల బృందాలను పంపి హరితహారం కార్యక్రమాన్ని అధ్యయనం చేసి, ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు నిర్ణయించాయి. గత యేడాది అన్ని రాష్ట్రాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారుల బృందం కూడా తెలంగాణలో పర్యటించి పచ్చదనం పెంపు, అర్బన్ పార్కుల అభివృద్దిని ప్రశంసించింది.)