Talasani Srinivas Yadav Minister for Animal Husbandry
వైకుంఠ ఏకాదశి కి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని జియాగూడాలో రంగనాథ స్వామి ఆలయం వద్ద వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల, తిరుపతి దేవస్థానం తరువాత జియాగూడలోని రంగనాథ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎంతో ఘనంగా, అద్భుతంగా జరుగుతాయని అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనానికి వస్తారని వెల్లడించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు తోపులాటకు గురికాకుండా బారికేడ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాలలో విద్యుత్ లైట్ లను ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్ధం మొబైల్ టాయిలెట్ ల ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా భక్తులకు అందించేందుకు లక్ష మంచినీటి ప్యాకెట్ లను అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలలో ఎక్కడా కూడా సీవరేజ్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆలయానికి వచ్చే రహదారులపై నిలిపి ఉంచిన వాహనాలను పూర్తిస్థాయిలో తొలగించాలని, వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాపిక్ డైవర్షన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం CC కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక బస్సులను నడపాలని RTC అధికారులను మంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండు హెల్త్ క్యాంప్ లను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. ముందుగా మంత్రి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, కార్పొరేటర్ లు దర్శన్, కరుణాకర్, RDO వెంకటేశ్వర్లు, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, DMC నర్సింహ, EE వెంకట శేషయ్య, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఆలయ పండితులు శేషాచార్యులు, ట్రాన్స్ కో DE నెహ్రూ నాయక్,R &B EE రవీంద్ర మోహన్,ఫైర్ అధికారి దత్తు, వాటర్ వర్క్స్ GM షరీఫ్, స్ట్రీట్ లైట్ EE వెంకటేష్, హార్టికల్చర్ DD భీమా, శానిటేషన్ DE రాజు, టౌన్ ప్లానింగ్ CP రంజిత్, ట్రాఫిక్ ACP కోటేశ్వర్ రావు, ఇన్ స్పెక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.