Tupaki Ramudu Pre Release Event
`తుపాకీ రాముడు` ప్రీ రిలీజ్ ఫంక్షన్
బిత్తిరి సత్తి, ప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `తుపాకీ రాముడు`. రసమయి ఫిలింస్ పతాకంపై టి.ప్రభాకర్ దర్శకత్వంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 25న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు, సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాసయాదవ్, ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.బిగ్ సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా….
తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ – “రసమయి అన్న ఓ సాహసమే చేశాడు. తెలంగాణ ఉద్యమంలో ఓ సినిమా చేశాడు. ఇప్పుడొకక సినిమా చేశాడు. ఇందులో నాకు నచ్చిన విషయమేమంటే నిర్మాత రసమయి ఓ తెలంగాణ వ్యక్తి, ఉద్యమకారుడు. డైరెక్టర్ ప్రభాకర్ తెలంగాణ వ్యక్తి. హీరో,హీరోయిన్లు తెలంగాణ బిడ్డలే. ఈ సినిమాలో అందరూ తెలంగాణ వారినే పెట్టి ఓ అద్భుతమైన సినిమా తీశారు. అది కూడా ఓ తెలంగాణ పల్లెలో తీశారు. తెలంగాణ కళలు, సంప్రదాయం, పండుగ బతుకమ్మ గురించి ఉన్న సినిమా. ఓ సందేశాత్మకమైన చిత్రం. సినిమాను ఆదరించండి. సినిమా అద్భుతంగా 100 రోజులు నడవాలని కోరుకుంటున్నాను. రసమయిలో మంచి టాలెంట్ ఉంది. ట్రైలర్ చూడగానే నచ్చింది. రవి అలియాస్ బిత్తిరి సత్తి అయ్యుండు.. ఈ సినిమా తర్వాత అలియాస్ తుపాకీ రాముడుగా మారిపోతాడేమో అనిపించింది. తను అద్భుతమైన యాక్టర్‌గా ముందుకు ఎదగాలని, రసమయి ఉద్యమకారుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నిర్మాతగా నాలుగు పైసలు సంపాదించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను“ అన్నారు.
తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ – “మా రసమయి మంచి సృజనాత్మకత ఉన్న మిత్రుడు. తను తీసిన ఈ సినిమాను సక్సెస్ చేయాలంటే దిల్‌రాజుగారి చేతిలో ఉందని తను అడగ్గానే ఆయన సినిమాను విడుదల చేయడానికి ముందు వచ్చినందుకు థ్యాంక్స్. ఈ సినిమాలో నటించిన బిత్తిరి సత్తికి, ప్రియగారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ – “తుపాకీ రాముడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారనే విషయాన్ని రసమయిగారు నాకు చెప్పారు. కళలు పట్ల ఆయనకుండే మక్కువ. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాడిన పాటలు అందరికీ తెలిసిందే. కళలుపై ఉండే మక్కువతో రసమయిగారు ఈ సినిమా చేశారు. అలాగే తెలంగాణకు చెందిన మారుమూల గ్రామంలో పుట్టిన యువకుడు బిత్తిరి సత్తి.. గురించి తెలియని తెలుగువాడు లేడు. తెలుగు ఇండస్ట్రీలోనే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి ఐకాన్‌గా ఉన్నా దిల్‌రాజుగారితో నేను మాట్లాడాను. కొంత నష్టమైనా భరించాలని నేను చెప్పాను. ఆయన ధైర్యంగా ముందుకు వచ్చి థియేటర్స్‌ను ఇప్పించారు. ఇదే యూనిట్‌తో మంచి కథను తయారు చేసి సినిమా తీయాలని, నేను ఎవరికైనా చెప్పి ఆ సినిమాను తీసే ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తుపాకీ రాముడు సినిమాను ప్రజలందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
ఎమ్మెల్యే, నిర్మాత రసమయి బాలకిషన్ మాట్లాడుతూ – “నేను ఈ సినిమా తీసే క్రమంలో ఎమ్మెల్యేగా బిజీగా ఉంటావు కదా! మరి సినిమా తీయగలవా? అని ప్రశ్నించారు. అయితే మా నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఎంతగానో సహకారం అందించారు. సినిమాను చేయడం కంటే దాన్ని రిలీజ్ చేయడం ఎంతో కష్టం అని దిల్‌రాజుగారిని కలిశాకే తెలిసింది. ఆయనెన్నో కొత్త విషయాలు చెప్పారు. ఈ సినిమాను ప్రజల గుండెల్లో నుండి వచ్చిన బ్రేకింగ్ స్టార్ బిత్తిరిసత్తిని హీరోగా పెట్టి ఈ సినిమా చేశాను. తను ప్రవాహానికి ఎదురీదే చేపల కుటుంబం నుండి వచ్చిన హీరో తను. అలాగే హీరోయిన్ ప్రియ కరీంనగర్‌కి చెందిన అమ్మాయే. సినిమా చేయడంలో అందరూ హెల్ప్ చేశారు. ఇప్పుడు మా భారన్నంతా దిల్‌రాజుపైనే వేశాను. ఆయన రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్. ఈ సినిమా నాది కాదు.. మనందరిదీ. దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ – “మంచి ప్రయత్నం చేశారు. `తుపాకీరాముడు` అక్టోబర్ 25న విడుదలవుతుంది. అయితే రెండు నెలలుగా నన్నెంతగానో ఇబ్బంది పెట్టాడు. ఈరోజుల్లో సినిమాను అందరూ తీసేస్తున్నారు. కానీ ప్రేక్షకుల ద్వారా డబ్బులు వచ్చేలా సినిమా తీస్తేనే అందరికీ మంచింది. కానీ ఇది చాలా మందికి అర్థం కాలేదు. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్“ అన్నారు.
బిత్తిరి సత్తి మాట్లాడుతూ – “నన్ను నమ్మి ఇంత ఖర్చు పెట్టి సినిమాను చేసిన రసమయి గారికి కృతజ్ఞతలు. కరీంనగర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. కరీంనగర్లో వివేక్ సార్! వీ6 ఛానెల్ ద్వారా పెద్ద యాంకర్‌ను చేశారు. అలాగే అదే జిల్లాకు చెందిన రసమయి అన్న హీరోను చేశారు. దిల్ సినిమాకు ఆడిషన్‌కు వెళ్లినప్పుడు నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దిల్‌రాజుగారే నా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. నేను ఈరోజు ప్రేక్షకులకు గుర్తున్నానంటే కారణం.. మా ఊర్లో మా ఇంటి పక్కనుండే ముకుంద రెడ్డిగారు ఇచ్చిన బిత్తిరి సత్తి పేరు. ఆ పేరుతోనే ఇప్పుడు నేను మీ అందరినీ పలకరిస్తున్నాను. నేనేమీ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోలేదు. డిప్లొమాలు చేయలేదు. ప్రేక్షకులను చూసే నేర్చుకున్నాను. బిత్తిరి సత్తి పాత్రతో ఛానెల్ నుండి నా ప్రయాణం ప్రారంభిస్తే ఇవాళ తుపాకీ రాముడు వరకు చేరాను. చాలా మంచి అవకాశాలు వచ్చాయి. ఎక్కడో బ్యాగ్రౌండ్లో ఉండే ఆర్టిస్టుని ఫోర్ గ్రౌండ్లో పెట్టారు. ప్రభాకర్‌గారు నాతో అద్భుతంగా నటింపచేశారు. సీనియర్ హీరోలతో సినిమాలు చేసిన ప్రభాకర్‌గారు నాతో సినిమా చేశారు. ఈ సినిమాకు కొన్ని వందల మంది కష్టపడ్డారు. మా సినిమా కోసం మేం సింగపూర్ పోలేదు. సింగరేణికి వెళ్లాం. సింగరేణిలో అద్భుతమైన కళాకారులున్నారు. ఈ సినిమాలో నటించినవారందరూ అద్భుతంగా నటించారు. ఎప్పుడు నవ్వించే సత్తి.. ఈసినిమాతో ఏడిపిస్తాడు. సినిమాకు వచ్చే ప్రతి ఒక ప్రేక్షకుడు నవ్వుకుంటాడు.. ఏడుస్తాడు. ఈ సినిమాతో నన్ను ఇంకా బాగా ఆదరిస్తారు“ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్.శంకర్, కర్నె ప్రభాకర్, యాదన్న, హీరోయిన్ ప్రియ, సుమ, రాజ్‌తరుణ్, ప్రియదర్శి తదితరులు హాజరయ్యారు.