Yerra Cheera song launch
స్టార్ డైరెక్టర్ బాబి చేతుల మీదుగా ఎర్రచీర లిరికల్ వీడియో సాంగ్ విడుదల
శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి ఢమరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్ సుమన్ బాబు స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ హర్రర్ చిత్రంలో శ్రీకాంత్, సాయి తేజస్విని సి.హెచ్ సుమన్‌బాబు, కారుణ్య, సంజనా శెట్టి, కమల్ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలోని రాజమండ్రి రైలెక్కి చెక్కేస్తారు లిరికల్ వీడియో సాంగ్ ను బుధవారం సాయంత్ర హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఢమరి మ్యూజిక్ కంపెనీ ద్వారా రిలీజ్ చేసారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ డైరెక్టర్ బాబీ, సీనియర్ నటుడు సత్యప్రకాశ్ పాటను, ఢమరి మ్యూజిక్ కంపెనీ లోగోను ఆవిష్కరించారు. అలాగే సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, బిగ్ సిడీని వక్తలంతా కలిసి ఆవిష్కరించారు. అనంతరం బాబి మాట్లాడుతూ, ` ఐటమ్ సాంగ్ బాగుంది. సుమన్ గారు దర్శకుడిగా, నిర్మాతగా రెండు బాద్యతలను నిర్వర్తించడం గొప్ప విషయం. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి` అని అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, `సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసాను. చాలా బాగున్నాయి. టైటిల్ క్యాచీగా ఉంది. ఇందులో హీరోలెవరు లేరు. సినిమాకి టైటిలే హీరో. సుమన్ గారు ఓ ముఖ్యమైన పాత్ర మాత్రమే చేసారు. చాలా మంది సీనియర్ ఆర్టిస్టులున్నారు. అలాగే సినిమా రిలీజ్ ను రెండు నెలలు ముందే ప్రకటించారు. చిన్న సినిమా రిలీజ్ తేదీలను ముందుగా ప్రకటించడం అంటే చిన్న విషయం కాదు. అందుకు సుమన్ గారిని మెచ్చుకోవాలి. ఆయన భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు చేయాలి. సినిమా చక్కని విజయం అందుకోవాలని ఆశిస్తున్నాను` అని అన్నారు.
దర్శక, నిర్మాత సత్య సుమన్ బాబు మాట్లాడుతూ, ` బాబిగారు చేతుల మీదుగా ఈ పాట రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది. ఆయన బిజీ షెడ్యూల్ లోనూ మా సినిమాకు కొంత సమయం కేటాయించి వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఢమరి మ్యూజిక్ ద్వారా పాటలను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం. ఈ కంపెనీ నాదే. కొన్ని కారణాల వల్ల మ్యూజిక్ కంపెనీ స్టార్ట్ చేసా. మా కంపెనీ సక్సెస్ అవుతుందన్న నమ్మక ఉంది. ఇందులో శ్రీకాంత్ గారు అఘోర పాత్రలో కనిపిస్తారు. ఇప్పటివరకూ శ్రీకాంత్ ను ఇలాంటి పాత్రల్లో చూసింది లేదు. ఈ నేపథ్యంలో ఆయన పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. డిసెంబర్ 27న సినిమా రిలీజ్ చేస్తాం` అని అన్నారు.
నిర్మాత, నటుడు గురురాజ్ మాట్లాడుతూ, ఎర్రచీర కథలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తాయి. రైలెక్కి రాజమండ్రి చెక్కెస్తారు సాంగ్ హైలైట్ గా ఉంటుంది. రఘుబాబు పాత్ర అందర్నీ బాగా నవ్విస్తుంది. మిగతా పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. సినిమా బాగా వస్తుంది. సుమన్ గారు భవిష్యత్ లో పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
సంగీత దర్శకుడు ప్రమోద్ మాట్లాడుతూ, ` మొత్తం 5 పాటలున్నాయి. రైలెక్కి రాజమండ్రి చెక్కేస్తారు పాటను రాజమండ్రికి చెందిన కడియం రవి రాసారు. గీధామాధురి పాడింది. పాట కోసం చాలా ట్యూన్స్ చేసాం. అలాగే మిగతా పాటలకు మంచి ట్యూన్స్ కుదిరాయి` అని అన్నారు.
మాజీ మంత్రి పుష్పలీల మాట్లాడుతూ, ` ఇటీవల కాలంలో పరిశ్రమలో కొత్త వాళ్లు బాగా సక్సెస్ అవుతున్నారు. వాళ్లంతా సీనియర్లకు మంచి పోటీ ఇస్తున్నారు. ఔత్సాహికులంతా ఇలాగే తమ ప్రతిభను నిరూపించుకోవాలి. పరిశ్రమ పెద్దలు వాళ్లకు అవకాశాలు కల్పించాలి. రాజకీయాల ఒత్తిడి నుంచి సినిమా మంచి ఉపశమానాన్ని ఇస్తుందని బలంగా నమ్ముతాను. మంచి కథతో ఎర్ర చీర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా విజయం సాధించి అందరీకి మంచి పేరు తీసుకురావాలి` అని అన్నారు.
రచయిత గోపీ మాట్లాడుతూ, ` ఎర్రచీర సినిమా ప్రమోషన్ బాగా జరుగుతుంది. వెంకటేష్ గారు, అనీల్ రావిపూడి గారు, బాబి గారు సినిమాను ప్రమోట్ చేసారు. అన్ని పనులు పూర్తిచేసుకుని డిసెంబర్ 27న రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులంతా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
నటుడు వెంకటగోవిందరావు మాట్లాడుతూ, ` సుమన్ గారు మంచి స్నేహితులు. కమిట్ మెంట్ డెడికేషన్ ఉన్న వ్యక్తి. చాలా ఫ్యాషన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా బాగా వస్తోంది. అందరికీ నచ్చే కథ. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది` అని అన్నారు.
నటి సంజనా శెట్టి మాట్లాడుతూ, `ఇందులో ఓ మంచి రోల్ పోషించా. అవకాశం ఇచ్చిన దర్శకులకు కృతజ్ఞతలన్నా`రు.