Governor Dr.Tamilisai Soundararajan Sammakka Saralamma
రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమ్మక్క-సారలమ్మ తల్లులను ప్రార్తించారు. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర చివరి రోజు శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై తల్లులను దర్శించుకుని తల్లులకు చీర, సారెలను,గోవిందరాజు, పగిడిద్దరాజులకు పంచెలను సమర్పించారు. గవర్నర్ తల్లుల దర్శనానికి రాగా రెవెన్యూ, గిరిజన సంక్షేమశాఖ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అధికారులు, పూజారులు గవర్నర్ కు చీరే, పసుపు కుంకుమ, బంగారం(బెల్లం), జ్ఞాపికను అందజేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా జాతర విశిష్టతను తెలియజేస్తు రూపొందించిన సావనీర్ ను ఆవిష్కరించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి గవర్నర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడారం జాతర దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర అని ఈ జాతరకు రావడం తల్లులను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలను రక్షిస్తూ ప్రజలందరికీ సుఖసంతోషాలను, అష్టైశ్వర్యాలను కలుగచేయాలని తల్లులను ప్రార్థించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు సీతక్క, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ఇలా త్రిపాఠి, ఆర్డీవో రమాదేవి, శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర పునరుద్ధరణ కమిటీ సభ్యులు సిద్దబోయిన జగ్గారావు, అధికారులు, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.