మహానటి దర్శకుడి మరో చిత్రం…
మహానటి దర్శకుడి మరో చిత్రం…
‘మహానటి’ సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. బయోపిక్‌లను కూడా ఇంత అద్భుతంగా తెరకెక్కుతాయా అన్నది ఆ చిత్రంతోనే ప్రేక్షకులకు అర్ధమయింది. మహానటి చిత్రం తర్వాత బయోపిక్ చిత్రాలకు డిమాండ్ పెరిగింది. వరుసగా బయోపిక్‌లు మొదలయ్యాయి. ప్రతీ దర్శకుడి కన్ను దాదాపుగా బయోపిక్ మీదే ఉంది. ఒకరకంగా చెప్పాలంటే దీనంతటికి కారణం ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్.
‘మహానటి’ – తెలుగుతెరపై నాగ్అశ్విన్ చేసిన ఇంద్రజాలం. ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుని, అటు కలెక్షన్లలోనూ, ఇటు టాక్‌లోనూ సునామీ సృష్టించింది. చాలాకాలం తర్వాత తెలుగువారు సకుటుంబ సమేతంగా చూసిని చిత్రంగా పేరు తెచ్చుకుంది. భారీ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన అశ్వినీదత్, తన కూతుళ్లు ప్రియాంక, స్వప్న నిర్మించిన ఈ చిత్రానికి ఎన్నో ప్రశంసలు దక్కాయి.
‘మహానటి’ తర్వాత స్వంతంగా ఏ సినిమాను చేపట్టని నాగ్అశ్విన్, వైజయంతీ మూవీస్, ఈరోజు ట్విటర్లో ఒక సంచలన ప్రకటన చేసింది. తాము ఒక గొప్ప ప్రాజెక్టును చేపట్టబోతున్నామని, ఈ యాత్ర సెప్టెంబరులో ప్రారంభం కానుందని తెలిపింది. ఈ కొత్త చిత్రానికి విజువల్ ఆర్టిస్టులు, డిజైనర్లు, రచయితలు కావాలని పిలుపు కూడా ఇచ్చింది.
మహానటి విజయం తర్వాత, ఆ సంస్థతో ఎంతో అనుబంధమున్న మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత దర్శకులను తన ఇంటికి సాధరంగా ఆహ్వానించి, ఘనసన్మానం చేసారు. మహానటి సావిత్రిని మళ్లీ సాక్షాత్కరింపజేసారని నాగ్‌అశ్విన్‌ను ఎంతో ప్రశంసించారు. తాను అశ్విన్‌తో ఒక సినిమా చేస్తానని, కథ తయారుచేసుకోమని కూడా వారికి తెలియజేసారు.
మరి ఈ సందర్భంలో ప్రకటించబడిన సినిమా ఏమిటో ఇంకా తెలియరాలేదు. మెగాస్టార్ కోసం ఆశ్విన్ కథను తయారుచేసుకోవడంలో నిమగ్నమయ్యాడని, ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్‌తో తీయాలని చాలా సీరియస్‌గా పరిశోధన చేస్తున్నాడని ఫిలింనగర్ వార్త. ఎలాగూ అనౌన్స్మెంట్ వచ్చేసింది కాబట్టి, వివరాలకు అట్టే సమయం పట్టే అవకాశం లేదు. వేచి చూడాలి మరి చిరుతో చేస్తాడా లేక ఇంకెవరితోనైనా ప్రయతన్నిస్తాడా అన్నది ప్రశ్నార్ధకం.