ముద్దుల గురించి పిల్లలకు తెలియనిదేమీ లేదు- నాగార్జున
ముద్దుల గురించి పిల్లలకు తెలియనిదేమీ లేదు- నాగార్జున
2002లో కె. విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ మన్మధుడు. ఈ చిత్రం అప్పట్లో ఎంత క్రేజ్‌ని సంపాదించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కామెడీకి కామెడీ, రొమాన్స్‌కి రామాన్స్ ఏ మాత్రం తగ్గకుండా అటు ఫ్యామిటీ ఆడియన్స్‌ని, ఇటు యూత్‌కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు దర్శకుడు. ఇప్పుడు దాదాపుగా అదే కోవలో దానికి సీక్వెల్‌గా మన్మధుడు-2 రాబోతుంది. రకుల్, నాగార్జున జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా ఆయన విలేకరులతో పంచుకున్న విశేషాలు…
ఎన్ని చిత్రాల్లో నటించినా ప్రతీ చిత్రం నాకు స్పెషల్‌గానే ఉంటుంది. అదే విధంగా మనసులో కూడా కాస్త టెన్షన్ ఉంటుంది. నేను కొత్త కథల పై మనసుకు దగ్గరైన కథల పై కాస్త ఎక్కువ ఇంట్రస్ట్ తీసుకుంటా. అలాంటి కథే ‘మన్మథుడు 2’ కూడా. సినిమాలో ఎమోషన్ గుడ్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంటుంది. అయితే, స్క్రిప్ట్ చాల బాగున్నా.. సినిమా పై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని నేనూ ఆసక్తిగా ఉన్నాను. ఇకపోతే రాహుల్ గురించి చెప్పాలంటే తన మొదటి సినిమా ‘చి.ల.సౌ’ చూసిన తరువాత, ముఖ్యంగా అతను సినిమా తీసిన విధానం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. ప్రతి చిన్న పాయింట్‌ను కూడా అందులో వినోదంగా చూపించాడు. నన్ను హీరోగా అన్నాక రాహుల్ నన్ను కొత్తగా చూపించాలని అనుకున్నాడు. ఖచ్చితంగా తను తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. అన్నిటికిమించి రాహుల్ ఈ చిత్రాన్ని అందమైన కుటుంబ భావోద్వేగాలు హైలెట్ అయ్యేలా తెరకెక్కించాడు.
ఈ సినిమా ప్రారంభంలో రకుల్ ఈ సినిమాలో నటించడం నాకు ఇష్టంలేదని వార్తలు వచ్చాయి. అవన్నీ పుకార్లు మాత్రమే. సినిమాలో రకుల్ పాత్ర చాలా బాగుంటుంది. తను కూడా అవంతిక పాత్రలో చాలా బాగా నటించింది. ఆమె అంకితభావం బాగా నచ్చింది. తను ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలుకానీ బిహేవ్గానీ నచ్చి యూనిట్లో అందరికీ చెప్పేవాడిని. ‘చూడండి ఆమె నుంచి చాలా నేర్చుకోవాలని’. తను నటిగా మంచి పెర్ఫార్మర్. వెన్నెల కిషోర్, నా కాంబినేషన్లో వచ్చే సీన్స్ కూడా ఫుల్‌గా నవ్విస్తాయి. ఈ చిత్రంలోని కామెడీ బాగా వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నాను.
సినిమాలో నా పాత్రను తెలివిగా వివరించినందుకు రాహుల్‌కు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఇక రొమాన్స్ కంటే కూడా, ఈ సినిమాలో హాస్యభరితమైన ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. సినిమాలో నాకు ముగ్గురు సోదరీమణులు, తల్లి ఉంటారు. గారాబంగా పెంచారు. అయితే నా ఇష్టానికి వ్యతిరేకంగా నేను వివాహం చేసుకోవాలని వాళ్లు నన్ను బలవంతం చేస్తారు. వారిని సంతృప్తి పరచడానికి సినిమాలో నేను ఏమి చేస్తాను అనేది మిగతా కథ. ఇదొక ఫ్రెంచ్సినిమాలోని థ్రెడ్ మాత్రమే తీసుకుని చేశాం. నేను ముందు ఆ సినిమా చూశాను. తర్వాత రాహుల్‌కు చెబితే నేను రీమేక్ చేయనన్నాడు. ఒక్కసారి చూడమని చెప్పాను. చూశాక తన నిర్ణయం మార్చుకుని తప్పకుండా ఈ సినిమా చేస్తానన్నాడు. ఇక రొమాంటిక్ సీన్స్ రొమాన్స్ విషయానికి వస్తే ముద్దుల గురించి ప్రత్యేకించి మన పిల్లలకు తెలియదనుకోవడం మన అమాయకత్వం అనే చెప్పాలి. ఈ రోజుల్లో అమాయకులు ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరికీ అన్నీ తెలుస్తున్నాయి అని ముగించారు.